కోవిడ్‌.. రోగుల్ని, ఆరోగ్యవంతుల్ని కలవరపెట్టి కుటుంబాలను మానసిక అల్లకల్లోలానికి గురి చేస్తోంది. అందరికి తెలియని భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒత్తిడి తట్టుకోలేక ఒక డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒక్కసారిగా అందరినీ క‌ల‌చివేసింది.

ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కోవిడ్ వార్డులోని రోగులకు నిరంతరం సేవలు చేస్తూ డిప్రెషన్ కి గురై వివేక్ రాయ్ అనే యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. యూపీ లోని గోరఖ్ పూర్ కు చెందిన ఈయన ఈ పాండమిక్ లో వందలాది పేషంట్లకు చికిత్స చేశారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ చీఫ్ డాక్టర్ రవి వాంఖేడ్ కర్ తెలిపారు. ఈయన ఎంతో బ్రిలియంట్ డాక్టర్ అని, ఇంత విషమ స్థితిలో కూడా రోజుకు కనీసం ఏడెనిమిది మంది రోగులకు సేవలు అందించారని.. అయితే, తన కళ్ళ ముందే రోగులు మరణిస్తుంటే వివేక్ రాయ్ చూడలేక డిప్రెషన్ కి గురయ్యారని చెబుతున్నారు. రోగుల బాధలు, కుటుంబ సభ్యుల కన్నీళ్లు చూసి ఇలా జీవించడం కన్నా మరణించడమే మేలని వివేక్ సూసైడ్ చేసుకున్నారని రవి వాంఖేడ్ కర్ ట్వీట్ చేశారు. వివేక్ గత నవంబర్ లో వివాహం చేసుకోగా అతని భార్య ఇప్పుడు రెండు నెలల గర్భవతి.

ఒక యువ డాక్టర్ బలవన్మరణం వ్యవస్థ చేసిన హత్యేనని రవి పేర్కొన్నారు. ఈ సిస్టమే నిరాశా వాదాన్ని సృష్టించిందని ఆయన అన్నారు. బ్యాడ్ సైన్స్, బ్యాడ్ పాలిటిక్స్, బ్యాడ్ గవర్నెన్స్ అంటూ ట్వీట్ చేశారు.

ఈ సందర్బంగా చాలా మంది డాక్టర్ లు తమ అభిప్రాయాలు బయట పెట్టారు. రోజుకు 10 గంటల పాటు తాము పని చేస్తున్నామని, కానీ రోగుల ప్రాణాలు రక్షించలేకపోతున్నామని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సౌకర్యం లేక పలువురు రోగులు మృతి చెందుతున్నారని వారు పేర్కొన్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story