ప్రమాదంలో మరో ప్రమాదం

Yesterday Siddipet accident .. ఓ ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోవడంతో సహాయక చర్యలు చేపడుతున్న స్థానికులు, పోలీసులపై

By సుభాష్  Published on  5 Dec 2020 4:16 AM GMT
ప్రమాదంలో మరో ప్రమాదం

ఓ ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోవడంతో సహాయక చర్యలు చేపడుతున్న స్థానికులు, పోలీసులపై మరో డీసీఎం వాహనం దూసుకురావడంతో మరో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మరో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, పది మంది పోలీసులు గాయపడ్డారు. ఈ విషాద ఘటన నిన్న సిద్దిపేటలో చోటు చేసుకుంది. ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా, ఈ ప్రమాదాన్ని చూడడానికి వచ్చిన, సహాయక చర్యలు చేపడుతున్న జనాలపై డీసీఎం దూసుకురావడంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో సీఐ సహా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. శుక్రవారం సిద్దిపేట శివారులోని రాజీవ్‌ రహదారిపై చోటు చేసుకుంది.

పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ కథనం ప్రకారం.. హుజురాబాద్‌లో నివాసం ఉండే బయ్యారం నరేందర్‌రెడ్డి వైద్య సేవల నిమిత్తం తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. సిద్దిపేట వివారులోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న సురేందర్‌రెడ్డి (39), ఆయన తల్లిదండ్రులు రాజిరెడ్డి (70), విజయ (65)లు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇక ప్రమాద విషయం తెలుసుకున్న సిద్దిపేట టూటౌన్‌ సీఐ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తుండగా, అంతలోనే కరీంనగర్‌ నుంచి అతి వేగంగా వస్తున్న డీసీఎం ఓ కారును ఓవర్‌టెక్‌ చేస్తూ కారు ప్రమాదం వద్ద ఉన్న పోలీసులు, జనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందగా, పోలీసులకు, పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు సిద్దిపేట జిల్లా రాముని పట్ల గ్రామానికి చెందిన అనరాశి మల్లేశం '41), మందపల్లి గ్రామానికి చెందిన వీరన్నపేట ఎల్లారెడ్డి (48)లను ఆస్పత్రికి తరలిస్తుండగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక గాయపడిన మిగతా వారిని చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం మళ్లీ హైదరాబాద్‌కు తరలించారు. అయితే గాయపడిన వారిలో గోపిరెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలా రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story