లారీతో ఓ యువకుడిని ఢీ కొట్టి కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘటనలో మూలగుంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజ(32) మరణించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. రవితేజ మూలగుంటపాడులో నివాసం ఉంటూ ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి భార్య, ఐదేళ్ల కుమారై ఉన్నారు. గురువారం రాత్రి రవితేజ తన మిత్రుడు ఉమ తో కలిసి వేర్వేరు బైక్‌లపై కనుమళ్ల వస్తున్నారు. ఓ లారీ వెనుక నుంచి రవితేజను ఢీ కొట్టడడంతో అతడు రోడ్డు మీద పడిపోయాడు. లారీ అతడిని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో రవితేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఉమ.. లారీని వెంబడించి ఆపేందుకు యత్నించగా అతడిపైకి కూడా లారీ దూసుకురాగా తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచ్. సింగరాయకొండ మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో ఎంపీటీసీ సభ్యుడికి, రవితేజకు మధ్య వివాదం ఉందని స్థానికులు అంటున్నారు. హత్యకు ఇదే కారణమై ఉంటుందని బావిస్తున్నారు. రవితేజ మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలు నుంచి అదనపు బలగాలు గ్రామానికి చేరుకున్నాయి.