Yadadri: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. యువకుడి వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 19 Nov 2024 6:25 AM ISTYadadri: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. యువకుడి వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విద్యానగర్ కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ ఎలగందల సతీష్ కుమార్, సంధ్య దంపతులకు కుమార్తె హాసిని (19), కుమారుడు ఉన్నారు. హాసిని సికింద్రాబాద్‌లోని కస్తూర్బా మహిళా డిగ్రీ కాలేజీలో సెకండీయర్ చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటూ రోజూ కాలేజీకి వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోని భువనగిరిలోని రాంనగర్‌కు చెందిని నిఖిల్ అనే యువకుడు ఆమెను లవ్ పేరుతో కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు. నిఖిల్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. నిఖిల్ తరచూగా భువనగిరి వచ్చి వెళ్తున్నాడు.
కాలేజీకి సెలవు ఉండటంతో హాసిని 2 రోజుల కిందట ఇంటికి వచ్చింది. నిఖిల్ ఆదివారం నాడు హాసిని ఫోన్‌కు అసభ్యకర మెసేజ్‌లు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లాక ఇంట్లోనే ఉరి వేసుకుంది. రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగొచ్చేసరికి హాసిని మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాసిని, నిఖిల్ భువనగిరిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ వరకు కలిసి చదువుకున్నారని, అప్పటి నుంచే వేధింపులకు గురి చేస్తున్నాడని, అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.