హరియాణాలో దారుణం జరిగింది. రెజ్లింగ్ అకాడమీలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళా రెజర్లు, ఇద్దరు కోచ్‌లు ఉన్నారు. కోచ్ దంపతులు చనిపోగా.. వారి మూడేళ్ల కుమారుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి మెహర్ సింగ్ అకాడమీలో జరిగింది. చనిపోయిన వారిని మండోతి గ్రామానికి చెందిన కోచ్ మనోజ్ కుమార్, అతడి భార్య సాక్షి, మోఖ్రా గ్రామానికి చెందిన మరో కోచ్ ప్రదీప్ ఫౌజీ, పూజా, సతీశ్ గా గుర్తించారు.
కొందరు రెజ్లింగ్ కోచ్‌ల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడారు. రెజర్లు మనోజ్, సాక్షి దంపతుల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. నిందితులను పట్టుకునేందు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.