కుటుంబంలో 'విడాకుల' అలజడి.. ప్రాణాలు తీసుకున్న భార్య
Women suicide in bhogapuram. విడాకులు ఇవ్వమని వేదించ నందుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది
By తోట వంశీ కుమార్ Published on 21 April 2021 2:06 PM ISTనాలుగేళ్ల క్రితం వారిద్దరికి పెళ్లైంది. వారి దాంపత్య జీవితానికి ప్రతిరూపాలుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. అతడికి రెండో పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టింది. దీంతో భార్యను విడాకులు ఇవ్వమని వేదించ సాగాడు. అత్తమామలకు తన గోడును వెళ్లబోసుకోగా.. వారి కొడుకుకు సర్ది చెప్పాల్సింది పోయి అతడికే వంత పాడారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ ఇల్లాలు అందరూ పడుకుని ఉండగా.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
భోగాపురం మండలం రావివలస గ్రామానికి చెందిన వెంపాల రాములబంగారికి(అలియాస్ శ్యామ్) కు దల్లిపేట గ్రామానికి చెందిన రమాదేవితో(21) నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కౌశిక (3), వాయిత్ (9 నెలలు) అనే ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే.. రెండేళ్ల క్రితం నుంచి వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. భర్తతో పాటు అత్తమామలు రమాదేవిని వేదించడం మొదలుపెట్టారు. తమ కుమారుడికి రెండో వివాహం చేస్తామని.. విడాకులు ఇవ్వాలని ఓ తెల్లకాగితం పై సంతకం పెట్టమని 15 రోజుల క్రితం రమాదేవిపై అత్త మామలు ఒత్తిడి తెచ్చారు.
దీంతో మనస్తాపానికి గురైన రమాదేవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, వారి బంధువులు కలిసి గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ నిర్వహించి వారిద్దరికీ సర్దిచెప్పి పంపించారు. ఈక్రమంలో మళ్లీ సోమవారం అత్తమామలతో పాటు భర్త కూడా విడాకులు ఇవ్వాలని రమాదేవిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రమాదేవి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అందరితో కలుపుగోలుగా ఉండే రమాదేవి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.