రైల్వే స్టేషన్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం.. నలుగురు అరెస్ట్
Women Molested by Railway Employees at new Delhi station.ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై దారుణాలు ఆగడం
By తోట వంశీ కుమార్ Published on 23 July 2022 1:20 PM IST
ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. నలుగురు రైల్వే ఉద్యోగులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రైల్వే) హరేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల మేరకు.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలు(30) రెండేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో ఓ స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒకడైన సతీష్‌తో పరిచయం ఏర్పడింది. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని అతడు మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో గురువారం బాధితురాలికి సతీష్ ఫోన్ చేసి తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు రావాలని కోరాడు.
ఇందుకు అంగీకరించిన బాధితురాలు రాత్రి 10.30 సమయంలో కీర్తినగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ సతీష్‌ను కలిసింది. ఆమెను సతీష్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను ఎలక్ట్రికల్ మెయిన్‌టేనెన్స్ రూమ్‌లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలివేసి వారు పరారు అయ్యారు.
తెల్లవారుజామున 3.27 గంటలకు బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడింది సతీష్ కుమార్, వినోద్ కుమార్, మంగళ్ చంద్ మీనా, జగదీష్ చంద్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు నలుగురు రైల్వేలోని ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం.