ఆసుపత్రి సెమినార్ హాల్‌లో కలకలం.. మహిళా ట్రైనీ డాక్టర్ మృతదేహం

31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (పిజిటి) వైద్యురాలు శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో శవమై కనిపించింది.

By అంజి  Published on  10 Aug 2024 6:45 AM GMT
Woman trainee doctor, Kolkata, hospital, Crime

ఆసుపత్రి సెమినార్ హాల్‌లో కలకలం.. మహిళా ట్రైనీ డాక్టర్ మృతదేహం

31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (పిజిటి) వైద్యురాలు శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో శవమై కనిపించింది. కోల్‌కతా పోలీసులు హత్య కేసు నమోదు చేసి, ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనకు దారితీసింది. వైద్య విద్యార్థులు, ప్రతిపక్ష బిజెపి శ్రేణులు వీధుల్లోకి వచ్చారు. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో అపస్మారక స్థితిలో కనిపించింది. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

వార్తా సంస్థ పిటిఐ ప్రకారం.. మరణించిన ఆమె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి . "ఆమె మృతదేహాన్ని ఎమర్జెన్సీ భవనంలోని సెమినార్ హాల్‌లో తోటి విద్యార్థులు కనుగొన్నారు, వారు మాకు సమాచారం అందించారు. మేము గత రాత్రి ఆమెతో డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతరులతో మాట్లాడుతున్నాము" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దర్యాప్తు కోసం నిపుణులు, డిటెక్టివ్ విభాగానికి చెందిన అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు.

ఆసుపత్రి వెలుపల నిరసనలు

ఇదిలావుండగా, ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైద్య విద్యార్థులు, పశ్చిమ బెంగాల్ బీజేపీ కార్యకర్తలు ఆస్పత్రి వెలుపల నిరసన చేపట్టారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం కోల్‌కతా పోలీసులను ఉపయోగించుకుంటోందని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆరోపించారు. ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థులు కోకాటలో క్యాండిల్ మార్చ్ కూడా నిర్వహించారు.

Next Story