అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా విద్యార్థులకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయురాలు అంతలోనే విగతజీవిగా మారింది. లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి చెందింది. ఈ విషాద ఘటన ముంబైలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మలాడ్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హై స్కూల్‌లో జెనెల్ ఫెర్నాండెజ్(26) టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆరో అంతస్తులోని విద్యార్థులకు పాఠాలు చెప్పిన అనంతరం రెండో అంతస్తులోని సాఫ్ట్ రూమ్‌లోకి వెళ్లేందుకు లిఫ్ట్ కోసం వేచి చూస్తోంది. లిఫ్ట్ రాగానే అందులోకి వెళ్లింది. రెండో ఫ్లోర్ బటన్ నొక్కింది. అయితే.. లిఫ్ట్ పైకి వెళ్లడం గమనించిన జెనెల్ అప్పటికీ లిఫ్ట్ తలుపులు మూసుకోకపోవడంతో బయటకు వచ్చేందుకు యత్నించగా బ్యాగ్ లిఫ్ట్‌లో చిక్కుకుంది.
బ్యాగును తీసుకునేందుకు టీచర్ ప్రయత్నించగా.. లిఫ్ట్‌లో ఆమె తల ఇరుక్కుపోయింది. బాధతో ఆమె కేకలు వేయడంతో పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెకు సాయం చేసేందుకు అక్కడకు వచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు కష్టపడి ఆమెను బయటకు తీశారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో నమోదైయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఏడాది జూన్‌లోనే ప్రైమరీ విభాగంలో జెనెల్ ఫెర్నాండెజ్ అసిస్టెంట్ టీచర్‌గా చేరడం గమనార్హం.