ఇంట్లో తెలియకుండా పెళ్లి.. కన్నవారికి తెలిసిన కాసేపటికే మృతి
Woman Suspicious death in Nagole.ఇంట్లోవారికి తెలియకుండా తాను ప్రేమించిన వ్యక్తిని వివాహాం చేసుకుంది ఓ యువతి.
By తోట వంశీ కుమార్ Published on 19 Nov 2021 4:09 AM GMTఇంట్లోవారికి తెలియకుండా తాను ప్రేమించిన వ్యక్తిని వివాహాం చేసుకుంది ఓ యువతి. గత ఏడు నెలలగా భర్తతో కాపురం చేస్తూ ఉంది. ఓ రోజు సోదరి ఇంటికి వెళ్లగా.. మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు కనిపించాయి. దీంతో ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను వివాహం చేస్తున్న సంగతి తెలియజేసింది. అయితే.. ఏం జరిగిందో తెలీదు కానీ.. కన్నవారికి సమాచారం అందించిన కొన్ని గంటల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జర్పుల తండాకు చెందిన జర్పుల మంత్రు, మారెమ్మ దంపతులకు ఇద్దరు కుమారైలు, ఓ కొడుకు సంతానం. చిన్న కుమారై అమూల్య(22) కొత్తపేటలోని ఓ కాఫీ షాపులో పనిచేస్తూ హాస్టల్‌లో ఉండేది. కాగా.. అక్కడే పనిచేస్తున్న నాగర్ కర్నూల్‌కు చెందిన డేవిడ్(25) తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు మార్చి 24న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. శివగంగాకాలనీలో ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. కాగా.. తనకు పెళ్లైన విషయాన్ని అమూల్య తల్లిదండ్రులకు చెప్పలేదు.
ఇటీవల సోదరి ఇంటికి వెళ్లింది. అమూల్య మెడలో నల్లపూసల తాడు, కాలికి మెట్టెలు చూసి.. సోదరి విషయాన్ని ఆరా తీసింది. సోదరికి విషయాన్ని చెప్పి అనంతరం అమూల్య అక్కడి నుంచి భర్త వద్దకు వచ్చింది. అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన పెళ్లి విషయాన్ని చెప్పింది. తన బంగారాన్ని ఇవ్వాలని, రూ.20వే పంపాలని కోరింది. పెళ్లి విషయమై ఫోన్‌లోనే కుటుంబ సభ్యులు అమూల్యను మందలించారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని వివరించారు. బుధవారం అర్థరాత్రి దాటాక బాత్రూమ్‌లో అమూల్య చున్నీతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో భర్త డేవిడ్ ఆస్పత్రికి తరలించాడు.
అయితే.. అప్పటికే అమూల్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అమూల్య మృతి చెందిన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు పెద్ద సంఖ్యలో గురువారం ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. తమ కుమారైను డేవిడ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.