పెళ్లి కావడం లేదని.. ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
Woman Sub Inspector commits suicide in Madhya pradesh.ఎంతో కష్టపడి ఎస్సైగా ఉద్యోగం సాధించింది. అన్నీ ఉన్నా
By తోట వంశీ కుమార్
ఎంతో కష్టపడి ఎస్సైగా ఉద్యోగం సాధించింది. అన్నీ ఉన్నా ఆమెకు ఒకటే అసంతృప్తి. ఆమె వయసు 35 సంవత్సరాలు. ఇంత వరకు ఆమెకు వివాహం కాలేదు. బయటకు వచ్చింది మొదలు.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్.. ఇంత వరకు ఎందుకు కాలేదు అని అడుగుతుంటే.. సమాధానం చెప్పలేక విసుగొచ్చింది. తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఓ దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంది. విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రత్‌లామ్ జిల్లా కేంద్రంలో కవితా సోలంకి(35) ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఇటీవల ఆమె సెలవు పెట్టి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. సెలవులు ముగియడంతో ఇటీవల విధుల్లో చేరారు. అదే రోజు రాత్రి తన అధికార నివాసంలో విషం తాగారు. అనంతరం తన స్నేహితులిరాలికి ఫోన్ చేసి విషయాన్ని వివరించింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న సదరు స్నేహితురాలు సోలంకి ని ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ సోలంకి మృతి చెందింది.
విషం తాగే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు వెల్లడించారు. `వయసు దాటిపోతున్నా పెళ్లి జరగడం లేదని ఆమె డిప్రెషన్‌కు గురైంది. స్నేహితులు, బంధువులు పెళ్లి గురించి వేసే ప్రశ్నలు ఆమెకు మరింత అసహనం కలిగించాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంద`ని ఎస్పీ గౌరవ్ తివారి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.