దారుణం.. కొడుకు బాగుండాలని కన్నకూతురిని బలిచ్చిన తల్లి

Woman sacrifices 12-year-old daughter for son's well being. రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల కొడుకు ఆరోగ్యం బాగుపడుతుందనే మూఢనమ్మకంతో

By అంజి  Published on  7 Nov 2022 1:55 PM IST
దారుణం.. కొడుకు బాగుండాలని కన్నకూతురిని బలిచ్చిన తల్లి

రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల కొడుకు ఆరోగ్యం బాగుపడుతుందనే మూఢనమ్మకంతో ఓ మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను గొంతు కోసి హత్య చేసింది. ఈ అమానవీయమైన ఘటన బరాన్‌ జిల్లాలో ఆదివారం జరిగింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు తల్లిని పట్టుకున్నారు. డీఎస్పీ తరుణ్ కాంత్ సోమాని మాట్లాడుతూ.. ''నిందితురాలు రేఖకు 16 ఏళ్ల కుమారుడు నికేంద్ర సింగ్‌ ఉన్నాడు. అతడికి గుండెలో రంధ్రం ఉంది. అతని మానసిక పరిస్థితి కూడా బాగోలేదు. దీంతో ఎవరినైనా బలిస్తే చేస్తే కొడుకు నికేంద్ర సింగ్‌ ఆరోగ్యం బాగుంటుందని ఎవరో చెబితే తల్లి నమ్మింది." అని చెప్పారు.

''రేఖ తన భర్త శివరాజ్‌పై దాడి చేసి, వారం రోజుల క్రితం నిద్రలోనే అతడిని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించింది. శివరాజ్ తప్పించుకోగలిగాడు. ఆదివారం ఆమె తన 7 ఏళ్ల కొడుకు సింగం, కుమార్తె సంజనను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించింది. కానీ ఆమె విఫలమైంది. మళ్లీ అదే రోజు సంజనకు స్నానం చేయిస్తుండగా, ఆమె వాష్‌రూమ్‌లో గొంతుకోసి చంపింది.'' అని డీఎస్పీ తరుణ్‌ కాంత్‌ తెలిపారు. తన కుమారుడి గుండెలో రంధ్రం పడిందని తెలుసుకున్న రేఖ మానసికంగా కుంగిపోయిందని శివరాజ్ తెలిపారు. నికేంద్ర సింగ్ చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం గత కొన్ని నెలలుగా మెరుగుపడుతోంది. పోలీసులు బాలిక మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి, నిందితురాలిగా ఉన్న తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story