గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి మృతి చెందింది.
తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో అంధురాలైన ఓ యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. సోమవారం యువతి ఒంటరిగా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాడి చేసింది రాజుగా గుర్తించారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. గంజాయి మత్తులో అతడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాగా.. నిన్న అతడు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని యువతి తన కుటుంబ సభ్యులతో తెలుపగా వాళ్లు అతడిని నిలదీశారు. ఈ క్రమంలో నేడు ఎవరూ లేని సమయంలో అతడు యువతిపై దాడికి పాల్పడ్డాడు.