మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో తన ముగ్గురు మైనర్ కుమార్తెలను విక్రయించినందుకు 42 ఏళ్ల మహిళ, ఆమె ప్రియుడిపై కేసు నమోదైంది. ముగ్గురు బాలికల వయస్సు వరుసగా 12, 14, 16 సంవత్సరాలు. బాలికలను కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుల నుండి పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికలు కొనుగోలు చేసిన వారి చెర నుంచి తప్పించుకుని తమ తాతయ్య వద్ద ఆశ్రయం పొందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో తాత పోలీసులకు సమాచారం అందించారు.
ముగ్గురు బాలికల తల్లి, ఓ వ్యక్తి రేవాలో కలుసుకున్నారు. అప్పటి నుంచి కలిసి జీవించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతడు ఆమెను, ఆమె ముగ్గురు పిల్లలను ఉజ్జయినిలోని టిపుఖేడికి తరలించాడని పోలీసులు తెలిపారు. ''తల్లి, ఆమె ప్రియుడు ఎనిమిది నెలల క్రితం ఇద్దరు మైనర్ బాలికలను రాజస్థాన్ నివాసితులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలకు విక్రయించారు. వారు 12 ఏళ్ల బాలికను రూ. 1.75 లక్షలకు మరొక వ్యక్తికి విక్రయించి పెళ్లి చేశారు'' అని మహిద్‌పూర్ సబ్‌డివిజనల్ పోలీసు అధికారి ఆర్‌కె. రాయ్ అన్నారు.
కొన్ని రోజుల క్రితం బాలికలు తమను కొనుగోలు చేసిన వారి నుంచి తప్పించుకోగలిగారు. ఆ తర్వాత వారు వారి తాతను కలుసుకున్నారు. అతనికి తమ కష్టాలను వివరించారు. బాలికలను తీసుకెళ్లి తాతా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాయ్ తెలిపారు. తల్లి, ప్రియుడు, కొనుగోలుదారులపై IPC సెక్షన్ 370 (మానవ అక్రమ రవాణా), 376 (గ్యాంగ్‌రేప్), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.