పూణేలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్తతో గొడవ పడిన భార్య.. తన 11 ఏళ్ల కొడుకును చంపి, 13 ఏళ్ల కూతురిపై దాడి చేసింది. సదరు నిందితురాలిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మంగళవారం తెలిపారు. ఆ మహిళ తన పిల్లలను చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో తన ఇంట్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆమె తన 11 ఏళ్ల బాలుడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి, అతని గొంతు కోసి చంపింది. ఆ తర్వాత ఆమె తన 13 ఏళ్ల కుమార్తెను చంపడానికి ప్రయత్నించింది, ఆమె గాయాలతో తప్పించుకోగలిగింది.
బాలిక గట్టిగా కేకలు వేసింది. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ యువరాజ్ హండే మాట్లాడుతూ, ఈ కుటుంబం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందినదని, పని కోసం పూణేలో నివసిస్తున్నారని చెప్పారు. తన భర్త మద్యానికి బానిస కావడం వల్ల తరచుగా వచ్చే గృహ వివాదాలే తనను ఈ నేరానికి ప్రేరేపించాయని, తన పిల్లలను చంపిన తర్వాత తన జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నానని ఆ మహిళ పోలీసులకు విచారణలో తెలిపింది.