వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లికొడుకులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. వికారాబాద్ జిల్లాలోని నవాబు పేట మండలంలో ఉన్న గేటు వనం పల్లిలో వివాహిత తన భర్త, కొడుకు రిత్విక్, కూతురు ప్రజ్వల(10)తో కలిసి నివాసం ఉంటుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురి అయిన తల్లి అరుంధ.. తన కొడుకు రిత్విక్ మరియు కూతురు ప్రజ్వలతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళింది.. అయితే కూతురు ప్రజ్వల అమ్మ... నన్ను బావిలో తోసి వేయకు.. నేను చనిపోవాలని అనుకోవడం లేదు అంటూ తల్లిని అర్థించింది. దీంతో తల్లి అరుంధకి కూతురు మాటలు విని బాధ కలిగింది. నువ్వు ఇంటికి వెళ్ళిపో అని కూతురికి చెప్పింది. బావి దగ్గర అమ్మ వ్యవహారం చూసి పది సంవత్సరాల కూతురు ప్రజ్వల గట్టి గట్టిగా కేకలు వేసింది.. వెంటనే తల్లి అరుంధ తన కొడుకు రిత్విక్ ను బావిలో తోసేసి అనంతరం తాను బావిలోకి దూకి ఆత్మహత్య చేసు కుంది.. కూతురు ప్రజ్వల అరుపులు విని స్థానికులు అక్కడికి వచ్చి.. బావిలో దూకి అరుంధ, రిత్విక్ ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ వారు అప్పటికే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.