క‌ల్లు కాంపౌండ్‌లో క‌లిసి.. ఆటోలో తీసుకెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం..!

Woman Gang rape in Himayat Sagar.దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2021 9:08 AM GMT
క‌ల్లు కాంపౌండ్‌లో క‌లిసి.. ఆటోలో తీసుకెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం..!

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. క‌ల్లు కాంపౌండ్‌లో మాట‌లు క‌లిపిన ఓ ఆటో డ్రైవ‌ర్‌.. ఇంటి వ‌ద్ద దించుతానంటూ ఆటోలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్క‌డ త‌న స్నేహితుల‌తో క‌లిసి మ‌హిళ‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం మ‌హిళ ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌దు, బంగారాన్ని తీసుకుని అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. మ‌త్తు నుంచి తేరుకున్న మ‌హిళ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ ఘ‌ట‌న రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. పురానాపూల్‌కు చెందిన ఓ మ‌హిళ‌(30) బుధ‌వారం సాయంత్రం హైద‌ర్‌గూడ‌కు వ‌చ్చింది. అక్క‌డ ఉన్న ఓ క‌ల్లు కాంపౌండ్‌లో క‌ల్లు తాగేందుకు వెళ్లింది. ఆమె క‌ల్లు తాగుతుండ‌గా.. అక్క‌డే ఉన్న ఓ ఆటో డ్రైవ‌ర్ ఆమెతో మాట‌లు క‌లిపాడు. ఈ క్ర‌మంలో ఆ మ‌హిళ‌ను ఇంటి వ‌ద్ద దించుతానంటూ న‌మ్మించాడు. అతని మాట‌లు న‌మ్మిన స‌ద‌రు మ‌హిళ అత‌డితో వెళ్లింది. మార్గం మ‌ధ్య‌లో మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు ఆటో ఎక్కారు.

హిమాయ‌త్‌సాగ‌ర్ స‌మీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. ముగ్గురు క‌లిసి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆ మ‌హిళ మెడ‌లో ఉన్న పుస్తెల‌తాడు, న‌గ‌దును ఎత్తుకెళ్లారు. మ‌త్తు నుంచి తేరుకున్న ఆ మ‌హిళ గురువారం ఉద‌యం స్థానికుల స‌హ‌కారంతో రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల‌ను గుర్తించే ప‌నిలో ఉన్నారు.

Next Story
Share it