పట్టపగలే.. మహిళా దొంగలు కొత్త తరహాలో చోరీకి యత్నం
Woman gang looting house in Krishna dist.చిన్న పని మీద ఇంటి యజమానికి తలుపుకు గడియ పెట్టి బయటకు వెళ్లాడు
By తోట వంశీ కుమార్ Published on 24 March 2021 9:43 AM ISTచిన్న పని మీద ఇంటి యజమానికి తలుపుకు గడియ పెట్టి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తలుపు తెరిచి ఉంది. అంతేకాకుండా ఇంట్లోంచి టీవీ సౌండ్ కూడా వినిపిస్తోంది. వెంటనే అతడికి అనుమానం వచ్చింది. చుట్టు ప్రక్కల వారిని పిలిచాడు. ఇంట్లోకి వెళ్లగా ఇద్దరు స్త్రీలు కనిపించారు. ఎవరు మీరు అని వారిని ప్రశ్నించగా.. మీరెవరు..? అడగకుండా ఇలా ఇంట్లోకి ఎలా వస్తారు..? అంటూ అతడినే దబాయించారు. నేనే ఈ ఇంటి యజమానిని అని చెప్పగా.. అతడిని లోపలికి లాగేందుకు యత్నించారు. ఈలోపు అక్కడకు చేరుకున్న ఇరుగుపొరుగు వారి సాయంతో వారిని పట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కంకిపాడు బస్టాండ్ సమీపంలో పచ్చిపాల కోటేశ్వరరావు అనే ఆటోడ్రైవర్ తన ఇంటికి గడియ పెట్టి పనులపై బయటకు వెళ్లాడు. కొద్ది సమయం తరువాత ఇంట్లోకి రాగా.. తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోంచి టీవీ సౌండ్ కూడా వినిపిస్తుండడంతో అనుమానం వచ్చి పక్కింటి వారిని పిలిచి విషయం చెప్పి వారిని బయట ఉంచి తను లోపలికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు మహిళలు కనిపించారు. ఆ మహిళలు.. అడగకుండా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని ఇంటి యజమాని కోటేశ్వరరావునే నిలదీశారు. వారి మాటలకు తొలుత కంగు తిన్న ఆయన తరువాత తేరుకుని ఈ ఇంటి యజమానిని నేను మీరు ఎవరు అని దబాయించాడు. వెంటనే ఆ ఇద్దరు మహిళలు అతడిని చెయ్యి పట్టుకుని లోపలకు లాగే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పక్కకు తోసి బయటకు వచ్చిన కోటేశ్వరరావు స్థానికుల సాయంతో వారిని పట్టుకున్నాడు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.
ఆ మహిళలు.. విజయవాడ లోని మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, సాత్విలుగా తెలిసింది. ఇద్దరూ అత్తాకోడళ్లేననీ, దొంగతనాలే వృత్తిగా చేస్తున్నారని తేలింది. నెల రోజుల క్రితమే సాత్వి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ డైపర్లో కూడా బంగారు ఆభరణాలను ఉంచడాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ పాత కేసులో వీరు రెండు నెలల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చారు.