వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. వైద్యం కోసం వచ్చిన మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారు. దీంతో మహిళ ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. ఈఘటన ఒడిశాలో గురువారం జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కుట్ర బ్లాక్‌లోని బుడకట గ్రామానికి చెందిన సరోజిని కాకు అనే మహిళ సికల్ సెల్ అనీమియా(రక్తహీనత)తో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.
వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించాలని చెప్పారు. అయితే.. మహిళ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. అయితే బి పాజిటివ్ రక్తం ఎక్కించారు. వెంటనే మహిళ ఆరోగ్యం క్షీణించి మరణించింది. వేరే గ్రూప్ రక్తం ఎక్కించారనీ.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సరోజిని కాకు చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని భద్రపరిచినట్లు వెల్లడించారు.