తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి వెలుతూ.. వరద నీటిలో చిక్కుకుని నవ వధువు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన 7గురు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తుఫాను వాహనంలో కడప మీదుగా తిరుమలకు వచ్చారు. శుక్రవారం రాత్రి తిరుపతిలో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల వరదలు కూడా వచ్చాయి. తూర్పు చర్చి వద్ద అండర్ పాస్ లో వరద ఉద్దృతి ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని తుఫాన్ డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం వరద నీటిలో చిక్కుకుపోయింది.
గమనించిన స్థానికులు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఓ చీరను ఆసరాగా చేసుకుని ఆరుగురు బయటకు వచ్చారు. అయితే.. సంధ్య(30) మాత్రం బయటకు రాలేక వాహనంలోనే ఉండిపోయింది. దీంతో ఆమె మృత్యువాత పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం తుఫాను డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సంధ్యకు కొద్ది రోజుల క్రితమే వివాహం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.