పోలీసులపై గ్రామస్థుల రాళ్ల దాడి.. మ‌హిళా కానిస్టేబుల్ మృతి

Woman cop killed in clash over custody death in Jehanabad.బిహార్ లోని జెహానాబాద్ సమీపంలోని నెహాల్ పూర్ లో పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 8:05 AM IST
పోలీసులపై గ్రామస్థుల రాళ్ల దాడి.. మ‌హిళా కానిస్టేబుల్ మృతి

బిహార్ లోని జెహానాబాద్ సమీపంలోని నెహాల్ పూర్ లో పోలీసులు, గ్రామస్తులకు చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌లో ఓ మ‌హిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. కుంతీదేవి అనే కానిస్టేబుల్ పై నుంచి వాహ‌నం దూసుకుపోవ‌డంతో ఆమె అక్క‌డిక్క‌డే మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళితే.. మ‌ద్యం మాఫియాకు చెందిన గోవింద్ మాంఝీ అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందాడు. విషయం తెలిసిన గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో హింస చెలరేగింది.

పోలీసులపై గ్రామస్థులు రాళ్లు రువ్వుతూ, కర్రలతో దాడి చేశారు. భయపడిన పోలీసులు వారి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. గ్రామస్థుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామస్థులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న కుంతీదేవి అనే మహిళా కానిస్టేబుల్ పైనుంచి ఓ వాహనం దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. అద‌న‌పు సిబ్బందితో వ‌చ్చిన పోలీసులు దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌తో జ‌హానాబాద్‌-అర్వాల్ ర‌హ‌దారిలో గంట‌ల పాటు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.


Next Story