అమ్మవారి కుమారైను అంటూ.. తనను తానే బలిచ్చుకున్న యువతి
Woman commits suicide by slitting her throat in a temple.సాధారణంగా గుడికి వెళితే నైవేద్యంగా ఫండ్లు, ఫలాలు పెడుతుంటాం.
By తోట వంశీ కుమార్ Published on 20 Aug 2021 4:03 AM GMTసాధారణంగా గుడికి వెళితే నైవేద్యంగా ఫండ్లు, ఫలాలు పెడుతుంటాం. ఇక గ్రామదేవతలకు పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. అయితే.. కొంత మంది మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఓ యువతి కూడా అమ్మవారికి తనను తానే బలిచ్చుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌జిల్లా ఖర్‌ఖడో పోలీస్ స్టేషన్ పరిధిలో కుది గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది.
కుది గ్రామానికి చెందిన ఓ యువతి నిత్యం అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించేది. ప్రతిరోజు ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించేది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా యువతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తాను మహా భద్రకాళి కూతురునని బావించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తెల్లవారుజామున ఆలయానికి వెళ్లింది. పూజ చేసిన తరువాత ఊహించని నిర్ణయం తీసుకుంది. అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు.
తొలుత గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. రోజు మాదిరిగా సాయంత్రం వచ్చిన పూజారికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి పూజారి షాక్‌కు గురైయ్యాడు. తేరుకున్న అనంతరం గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడు.
అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూఢ విశ్వాసాల వల్లే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే.. యువతి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి. మూఢనమ్మకాల కారణంగా ఆత్మహత్య చేసుకుందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి ఇలా క్రియేట్ చేశారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.