విషాదం.. మెట్రో డోర్‌లో చీర ఇరుక్కుని మహిళ మృతి

మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

By అంజి  Published on  17 Dec 2023 1:05 AM GMT
saree stuck, train, metro rail, Delhi

విషాదం.. మెట్రో డోర్‌లో చీర ఇరుక్కుని మహిళ మృతి

ఢిల్లీలోని ఇందర్‌లోక్ స్టేషన్‌లో మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమె చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగింది. 35 ఏళ్ల మహిళ మెట్రో ఎక్కిందా లేదా దిగిందా అనేది అస్పష్టంగా ఉంది. ఈ సంఘటన గురువారం, డిసెంబర్ 14 న జరిగింది. రెండు రోజుల తరువాత శనివారం మహిళ మరణించింది. మహిళ బంధువు విక్కీ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

"ఆమె ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్‌కు చేరుకుని రైలు మారుస్తుండగా, ఆమె చీర ఇరుక్కుపోయింది. ఆమె కిందపడి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమించడంతో ఆమెను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం సాయంత్రం, ఆమె మరణించింది" అని తెలిపాడు. ఆ మహిళ భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని విక్కీ తెలిపారు.

ఢిల్లీ మెట్రో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనూజ్ దయాల్ మాట్లాడుతూ, "డిసెంబర్ 14 న ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్‌లో ఒక సంఘటన జరిగింది, ఇక్కడ ఒక మహిళా ప్రయాణికురాలి దుస్తులు రైలులో చిక్కుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది."

ఈ ఘటనపై మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ (సీఎంఆర్‌ఎస్) విచారణ జరుపుతారని దయాల్ తెలిపారు. మెట్రో డోర్‌లు ఒక్కసారిగా మూయడంతో ఆమె దుస్తులు కొంత భాగం వాటి మధ్య ఇరుక్కుపోవడంతో ఆ మహిళ గురువారం మెట్రో రైలు కింద పడింది. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. "పోలీసులు దీనిని పరిశీలిస్తున్నారు. అవసరమైతే, న్యాయపరమైన అభిప్రాయం తీసుకోబడుతుంది" అధికారి చెప్పారు.

Next Story