అడవిలో భార్యను సజీవ సమాధి చేశాడు.. స్మార్ట్ వాచ్ కాపాడింది
Woman Buried Alive In Grave By Her Husband, Apple Watch Comes Into Rescue. ఓ మహిళ తన భర్త చేతిలో దారుణ హింసకు గురై సజీవంగా భూమిలో పాతిపెట్టబడింది. అయితే ఆ మహిళ
By అంజి
ఓ మహిళ తన భర్త చేతిలో దారుణ హింసకు గురై సజీవంగా భూమిలో పాతిపెట్టబడింది. అయితే ఆ మహిళ అద్భుతంగా సమాధి నుంచి బయటపడగలిగింది. దీనంతటికి కారణం సదరు మహిళ తన చేతికి పెట్టుకున్న యాపిల్ స్మార్ట్ వాచ్ వల్లే. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 16న వాషింగ్టన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. చాయ్ క్యోంగ్ (53), యంగ్ సూక్ ఆన్ (42) భార్యభర్తలు. కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు ఇస్తే.. తన భార్యకు భరణంగా రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, చాయ్ క్యోంగ్ తన భార్యను చంపాలనుకున్నాడు.
ఆ వెంటనే తన భార్యతో గొడవ పడ్డాడు. పక్కా ప్రణాళికతో.. భార్యను వేధించి టేప్‌తో కాళ్లు, చేతులు కట్టేసి, ఛాతీపై పొడిచి క్యారవ్యాన్‌లో ఎక్కించుకుని ఫారెస్ట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మహిళను సజీవ సమాధి చేశాడు. అయితే ఆమె చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ తన భర్త నుంచి దేవుడిలా కాపాడింది. వాచ్ సాయంతో ఆమె ఎమర్జెన్సీ నెంబర్ 911కి కాల్ చేసింది. ఆపరేటర్ పోలీసులకు తెలిపిన ప్రకారం.. ఒక మహిళ ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసింది. అయితే ఆమె మాట్లాడటం లేదు. ఆపరేటర్ బ్యాక్‌గ్రౌండ్‌లో చప్పుడు రావడం విన్నాడు.
అయితే కొంత సమయం తర్వాత అది పూర్తిగా నిశ్శబ్దం అయింది అని చెప్పాడు. పోలీసులు సెల్‌ఫోన్ టవర్‌ను గుర్తించి యంగ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె ఆచూకీ లభించలేదు. అయితే మహిళ ఆపదలో ఉందని పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళను సమయానికి రక్షించారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అక్టోబరు 17న రాత్రి 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఛాయ్‌ను అరెస్టు చేశారు.