శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం.. బహిర్భూమికి వెళ్లిన బాలింత పై సామూహిక హత్యాచారం
Woman Brutally murdered in Satya Sai District in AP.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ దారుణాలు ఆగడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 10 May 2022 5:02 AM GMTఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ దారుణాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన బాలింత పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆ తరువాత బండరాయితో తలపై మోదీ చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కొంతదూరం లాక్కెళ్లి పడేశారు.
వివరాల్లోకి వెళితే.. కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడు సంవత్సరాల క్రితం వివాహం కాగా.. ఏడు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. పది రోజుల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఈ క్రమంలో నిన్న(సోమవారం) ఉదయం బాబును తోడి కోడలికి అప్పగించి బహిర్భూమికి వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాసిన నిందితులు ఆమెపై దాడి చేశారు. బహిర్భూమికి వెళ్లిన ఆమె 10 గంటలైనా తిరిగి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. భర్తకు, బంధువులకు సమాచారం ఇచ్చారు.
బంధువల ఇళ్లలో వెతికినా లాభం లేకపోయింది. ఊరి బయట గాలిస్తున్న క్రమంలో విగతజీవిగా కనిపించింది. ముఖం పూర్తిగా ఛిద్రమై ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమీపంలోని బావి దగ్గర నుంచి బండరాళ్లను తీసుకువచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
కాగా.. ముందస్తు పథకంలో భాగంగానే గ్రామానికి చెందిన కొందరు ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు బంధువుల్లోనే కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంపడానికి ముందు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.