భర్తపై వైన్‌షాప్ సిబ్బంది దాడి.. ప్రతీకారం తీర్చుకున్న భార్య
హైదరాబాద్‌లోని మధురానగర్ వైన్స్‌షాపు వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 12:30 PM ISTభర్తపై వైన్‌షాప్ సిబ్బంది దాడి.. ప్రతీకారం తీర్చుకున్న భార్య
హైదరాబాద్‌లోని మధురానగర్ వైన్స్‌షాపు వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది. మద్యం కొనేందుకు వెళ్లిన తన ఒక వ్యక్తిపై వైన్‌షాపు సిబ్బంది దాడి చేశారు. అయితే.. తన భర్తనే కొడతారా అని మహిళ ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే వ్యక్తి మద్యం కొనేందుకు వైన్ షాపు వద్దకు వెళ్లాడు. షాపు వద్ద ఏం జరిగిందనేది పూర్తిగా తెలియదు కానీ.. అతన్ని వైన్ షాపు సిబ్బంది తీవ్రంగా కొట్టారు. మద్యం ఇవ్వాలని అడిగినందుకు కొట్టారంటూ వ్యక్తి వాపోయాడు. ఈ దాడి ఘటనలో వ్యక్తి తల పగిలిపోయి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఇక తన భర్తను వైన్ షాపు సిబ్బంది కొట్టడంపై అతని భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్తను కొట్టిన వైన్‌షాపులోకి చొరబడింది మహిళ. తన స్నేహితులతో కలిసి ఆ సిబ్బందిపై దాడికి తెగబడింది. బాటిల్స్ పగలగొట్టి, ర్యాకులను కొడుతూ.. క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి హడావుడి చేసింది.
ఒక మహిళ వైన్‌షాపులోకి చొరబడి స్నేహితులతో కలిసి గొడవ చేయడంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఆమె పోలీసులకు కూడా వినలేదు. పోలీసులు అని కూడా చూడకుండా జట్టు పట్టుకుని కొట్టింది. దాడి చేసిన వారిపై కాకుండా.. తనను, తన భర్తను అడ్డుకుంటారా అంటూ మండిపడింది. తన భర్తను తల పగిలేలా కొట్టారు కనిపించడం లేదా అంటూ నిలదీసింది. ఇక ఆమె దాడిలో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. ఈ సంఘటన జరుగుతున్న క్రమంలో పలువురు వీడియో తీస్తుండగా వారిని కూడా సదురు మహిళ దూషించింది. ఫోన్లను లాక్కుని పగలగొట్టే ప్రయత్నం చేసింది. ఇక చివరకు అతి కష్టం మీద మహిళను, ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైన్ షాపు సిబ్బందితో పాటు.. మహిళ వేర్వేరుగా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.