పోలీసు కస్టడీలో మహిళా కిడ్నాపర్‌ మృతి

18 నెలల పసికందును కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్‌ అయిన పి తిలగవతి అనే 40 ఏళ్ల మహిళ పోలీసు కస్టడీలో మరణించింది.

By అంజి  Published on  10 Oct 2023 1:30 PM IST
Woman arrest, Coimbatore, child abduction, police custody, Crime news

పోలీసు కస్టడీలో మహిళా కిడ్నాపర్‌ మృతి 

18 నెలల పసికందును కిడ్నాప్ చేసిన కేసులో అక్టోబర్ 9, సోమవారం నాడు కోయంబత్తూరులో అలందురై పోలీసులు అరెస్టు చేసిన పి తిలగవతి అనే 40 ఏళ్ల మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. అక్టోబర్ 5న తూత్తుకుడి జిల్లాలోని పుణ్యక్షేత్రమైన తిరుచెందూర్ నుంచి పాప కనిపించకుండా పోయింది.

పాప తల్లిదండ్రులు, కన్నియాకుమారి జిల్లాకు చెందిన ముత్తురాజ్, రాతి తిరుచెందూర్ పోలీసులను ఆశ్రయించగా, వారి దర్యాప్తులో తిలగవతి శిశువును తీసుకెళ్తున్న CCTV ఫుటేజీని కనుగొన్నారు. తిలగవతి, ఆమె భర్త పాండియన్‌లను కోయంబత్తూరులో అలందురై పోలీసులు అరెస్టు చేశారు. శిశువును అపహరించినట్లు వారు అంగీకరించారు, దీని తరువాత పోలీసులు పసికందును రక్షించారు. తిలగవతిని విచారిస్తున్నప్పుడు స్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు ప్రకటించబడిందని ఇండియా టుడే నివేదించింది.

పాప మిస్సింగ్ కేసును డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీవైఎస్పీ) వసంత్ రాజ్ ఆధ్వర్యంలో తిరుచెందూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులు తిలగవతి, పాండియన్‌లను గుర్తించగలిగారు. వారు నిందితుల మొబైల్ టవర్ లొకేషన్‌ను కోయంబత్తూరులో గుర్తించి, కోయంబత్తూరు జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు.

సోమవారం అలందురై పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు సిబ్బంది పూండిలోని ముత్తత్తువాయల్‌లోని కులతేరి గ్రామానికి వెళ్లి దంపతులను అదుపులోకి తీసుకుని తిరుచెందూర్ పోలీసులకు సమాచారం అందించారు. ది హిందూ ప్రకారం, శిశువు ఆచూకీ గురించి పోలీసు బృందం వారిని విచారించింది. ఆ దంపతులు పసిపిల్లల లొకేషన్‌ను ఒప్పుకుని, పంచుకున్నారు, ఆ తర్వాత సేలం పోలీసులు రక్షించారు. తిలగవతి స్వస్థలం సేలం జిల్లాలోని పెథానైకెన్‌పాళయం.

విచారణలో తిలగవతి స్టేషన్‌లో స్పృహతప్పి పడిపోయిందని, వెంటనే పూలవపట్టిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పిహెచ్‌సి) తరలించారని పోలీసులు తెలిపారు. అయితే అక్కడికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 176(1)(a) (పోలీసు కస్టడీలో మరణంపై మేజిస్ట్రేట్ విచారణ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్‌లోని అన్ని నిఘా కెమెరాల నుండి ఫుటేజీని ఉన్నతాధికారులు భద్రపరిచారు. విచారణ కోసం తిలగవతిరి విచారించిన పోలీసులను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు.

Next Story