దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. సౌత్ ఢిల్లీలోని ఓ క్లబ్‌లో మహిళ పట్ల బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ దుస్తులను చింపి వేసి అసభ్యకరంగా ప్రవర్తించారని మహిళ ఆరోపించింది. సౌత్ ఎక్స్‌టెన్షన్ పార్ట్-1 ప్రాంతంలోని ఓ క్లబ్‌లో బౌన్సర్లు తన దుస్తులను చింపి, క్లబ్‌లోకి ప్రవేశించే విషయంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని మహిళ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డా కోడ్ క్లబ్‌లో సెప్టెంబర్ 18న తెల్లవారుజామున 2:14 గంటలకు ఈ ఘటన జరిగిందని, బాధితురాలి నుండి తమకు కాల్ వచ్చిందని పోలీసులు చెప్పారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ బట్టలు చిరిగి చిందరవందరగా ఉన్నాయని గుర్తించారు. పోలీసుల విచారణలో.. ఆమె తన దుస్తులను ఇద్దరు బౌన్సర్లు, క్లబ్ నిర్వాహకులు చింపినట్లు తెలిపింది. వారు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, కొట్టారని, తనను అనుచితంగా తాకారని ఆమె చెప్పింది. నిందితుల గుర్తింపును గుర్తించామని, బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మహిళ ఫిర్యాదుదారుని పోలీసులు పరిశీలించారు.
ఆమె తన స్నేహితులతో కలిసి పార్టీ కోసం క్లబ్‌కు వచ్చిందని, అక్కడ ఎంట్రీపై వాగ్వాదం జరిగిందని, బౌన్సర్లు దూకుడుగా మారి ఆమెను, ఆమె స్నేహితులను కొట్టారని తెలియజేసింది. సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ సందర్భంగా క్లబ్‌తోపాటు ఇతర షోరూమ్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సాకేత్ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు క్లబ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారిపై చర్యలు తీసుకున్నారు.