దారుణం.. భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన భర్త

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  14 Dec 2023 10:59 AM IST
wife suicide,  husband, video record, crime, hyderabad,

 దారుణం.. భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన భర్త

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వచ్చిన భర్త భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. దాంతో.. ఆమె విసిగిపోయింది. నీతో బతకలేను చనిపోతానంటూ కన్నీరుపెట్టుకుంది. మద్యం మత్తులో భర్త ఉన్మాదిగా ప్రవర్తించాడు. అయితే చనిపో.. లైవ్‌లో ఎప్పుడూ ఎవరూ చనిపోతుంటే చూడలేదు అన్నాడు. ఆమె ఉరివేసుకుంటుంటే కనీసం ఆపకుండా నవ్వతూ వీడియో తీశాడు.

ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సయ్యద్‌ అలీగూడకు చెందిన షేక్‌ రసూల్‌కి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు నలుగురు సంతానం.. కాగా రెండో భార్య అర్షా బేగం (22)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. షేక్ రసూల్‌ కార్పెంటర్‌గా పనిచేస్తూ రెండు కుటుంబాలను పోషిస్తున్నాడు. అయితే.. కొంతకాలంగా రసూల్‌ మద్యానికి బానిస అయ్యాడు. రోజూ తాగి రెండో భార్య వద్దకు వెళ్లి గొడవపడేవాడు. అంతేకాదు.. ఇంట్లో నిత్యవసరాల కోసం కనీసం డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. దాంతో.. భార్య, భర్తల మధ్య వాగ్వాదం జరిగేది. పిల్లలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఉండాలని.. మద్యాన్ని వీడాలని భార్య ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అలాగే ఈనెల 11న కూడా తాగొచ్చిన భర్త రసూల్‌తో భార్య అర్షా బేగం మళ్లీ గొడవపడింది.

మద్యం మానకుంటే తాను చనిపోతానంటూ భర్త రసూల్‌ను బెదిరించి అర్షా బేగం. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రసూల్‌ ఉన్మాదిగా మారాడు. నువ్వు చస్తే తన మొదటి భార్య వద్దకు వెళ్లిపోతానంటూ అర్షా బేగంను ఎగతాళి చేశాడు. అంతేకాదు.. తాను ఒక మనిషి ప్రాణాలు పోవడం ఎప్పుడూ చూడలేదని.. ఇప్పుడు చూస్తానని చెప్పాడు. భర్త మాటలతో విసిగిపోయిన అర్షా బేగం ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. ఆమె ఉరివేసుకుంటుండగా భర్త సెల్‌ఫోన్‌లో వీడియో తీసి పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె ప్రాణాలు కోల్పోయాక బావమర్దికి ఫోన్ చేసి అర్షా బేగం సూసైడ్ చేసుకుందనీ.. వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. బావమర్ది, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. నిందితుడు రసూల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story