భర్తలపై భార్యల దాడి.. ఓ ఘటనలో వేడినూనె పోసి.. మరో ఘటనలో చెవులను కోసి..

భార్య భర్తల ఘర్షణలు, వివాహేతర సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. భర్తపై భార్య కాగుతున్న వేడి నూనె పోసింది.

By -  అంజి
Published on : 16 Sept 2025 9:16 AM IST

Wife pours hot oil on husband, Gadwal district, Crime

భర్తలపై భార్యల దాడి.. ఓ ఘటనలో వేడినూనె పోసి.. మరో ఘటనలో చెవులను కోసి..

భార్య భర్తల ఘర్షణలు, వివాహేతర సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. భర్తపై భార్య కాగుతున్న వేడి నూనె పోసింది. ఈ ఘటన గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం మల్లెందొడ్డిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 11న వెంకటేష్‌పై భార్య వేడి నూనె పోయగా చికిత్స పొందూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేష్‌ ఓ హోటల్‌ను నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. భార్యభర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీన భార్య పద్మ వేడి నూనె పోయడంతో భర్త వెంకటేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వెంకటేష్‌ను గద్వాల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన ట్రీట్మెంట్‌ కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ వెంకటేష్‌ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లల ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భర్త చెవులను కోసి..

మహబూబాబాద్‌ జిల్లా గడ్డిగూడెం తండాలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్త చెవులను కోసింది. గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం మండలం మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్‌ వేసింది. ఇద్దరూ కలిసి భర్తను చెవులు కోసేయగా.. ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. భార్యలు తీసుకుంటున్న ఈ విపరీత నిర్ణయాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి.

Next Story