Telangana: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. నిందితులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయులు హంతకులయ్యారు. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఒకరిని హత్య చేశారు.

By -  అంజి
Published on : 25 Dec 2025 7:49 AM IST

Wife kills husband with boyfriend, govt teachers, Nagarkurnool district, Crime

Telangana: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. నిందితులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయులు హంతకులయ్యారు. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఒకరిని హత్య చేశారు. ఈ ఘటన నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మారుతీనగర్‌ కాలనీలో నవంబర్‌ 25న అనుమానాస్పద స్థితిలో లక్ష్మణ్‌ నాయక్‌ (38) చనిపోయి కనిపించాడు. ఆయన సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అతడిని హత్య చేసింది ఆమె భార్యేనని తెలిసింది. ఈ దారుణంలో భార్య ప్రియుడు కూడా పాలు పంచుకున్నాడు.

లక్ష్మణ్‌ నాయక్‌ భార్య పద్మ (30).. 2024లఓ డీఎస్సీలో టీచర్‌గా ఎంపికై ఉప్పునుంత మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో పని చేస్తోంది. అదే మండలంలోని తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న రాత్లావత్‌ గోపి (36)తో ఆమెకు సంవత్సర కాలంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌ నాయక్‌ తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి పద్మ, గోపి అతడిని హత్య చేయాలనుకున్నారు.

నవంబర్‌ 24న రాత్రి లక్ష్మణ్‌ను ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ మరుఉదయం ఏమీ తెలియదు అన్నట్టుగా పద్మ స్కూల్‌కు వెళ్లింది. ఇంటి యజమానికి ఫోన్‌ చేసి తన భర్తకు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని నటించింది. మధ్యాహ్నం ఇంటికొచ్చిన పద్మ.. లోపల భర్త చనిపోయి ఉన్నాడని అందరినీ నమ్మించింది. అయితే పోలీసులు తమ దర్యాప్తులో అసలు విషయాలను బయటపెట్టారు. భర్తను హత్య చేసిన తర్వాత పద్మ తన సమీప బంధువు నర్సింహకు ఫోన్‌ చేసిందని తేల్చారు. పద్మ, గోపిలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story