ఆమెకు 33.. అత‌డికి 22.. ఫేస్‌బుక్ ప‌రిచ‌యం.. తీసింది భ‌ర్త ప్రాణం

Wife killed husband with the help of lover in Allagadda.ఆమెకు 33 ఏళ్లు. ఆ యువ‌కుడికి 22 ఏళ్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2022 10:13 AM IST
ఆమెకు 33.. అత‌డికి 22.. ఫేస్‌బుక్ ప‌రిచ‌యం.. తీసింది భ‌ర్త ప్రాణం

ఆమెకు 33 ఏళ్లు. పెళ్లై ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. ఆ యువ‌కుడికి 22 ఏళ్లు. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. త‌మ బంధానికి భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని బావించారు. ఈ నెల 1న రాత్రి మ‌ద్యం మ‌త్తులో ప‌డుకుని ఉన్న భ‌ర్త‌ను ప్రియుడి సాయంతో హ‌త్య చేసింది. త‌రువాత మృత‌దేహాన్ని సంచిలో వేసి దూరంగా ప‌డేశారు. అనంత‌రం ఏమీ తెలియ‌న‌ట్లు భ‌ర్త క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్‌ కరీముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు.

ఆళ్ల‌గ‌డ్డ‌లో క‌రీముల్లా, మాబ్బి దంప‌తులు నివ‌సించేవాళ్లు. వీరికి ముగ్గురు పిల్ల‌లు. క‌రీముల్లా ఆటో న‌డిపేవాడు. క‌రీముల్లా భార్య మాబ్బికి క‌డ‌ప జిల్లా పెద్ద‌ముడియం మండ‌లం జె.కొత్త‌ప‌ల్లె గ్రామానికి చెందిన వంశీకుమార్ రెడ్డితో ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్త వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. అయితే.. త‌మ బంధానికి క‌రీముల్లా అడ్డుగా ఉన్నాడ‌ని, అత‌డిని హ‌త్య చేస్తే త‌మ‌కు అడ్డు ఉండ‌ద‌ని బావించారు.

ఈ నెల 1న రాత్రి మ‌ద్యం మ‌త్తులో ఉన్న క‌రీముల్లా మెడ‌కు తీగ‌ను బిగించి హ‌త్య చేశాడు. అనంత‌రం మృత‌దేహాన్ని గోనె సంచిలో వేసి లింగందిన్నె ర‌హ‌దారిలో విద్యుత్తు ఉప‌కేంద్రం వ‌ద్ద ప‌డేశారు. కాగా..హ‌త్య‌కు ముందు రోజు అహోబిలం వెళ్లి ఎలా హ‌త్య చేయాలి, అనుమానం రాకుండా ఎలా ఉండాల‌న్న‌విష‌యాల‌పై ప్ర‌ణాళిక వేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

మృతుడి భార్య‌ మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డింది. నిందితుల‌పై హ‌త్య కేసు న‌మోదు చేసి రిమాండుకు త‌ర‌లించిన‌ట్లు డీఎస్పీ వెంక‌ట్రామ‌య్య తెలిపారు.

Next Story