తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీ కోసం జరిగిన గొడవ.. వృద్ధ దంపతుల జీవితాన్ని ముగించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలోని అయినవరంలో ఠాగూర్ నగర్ 3వ వీధిలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కరుణాకరన్ (75), పద్మావతి (66) నివసిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం ఉంది. నలుగురు పిల్లలు మహేశ్వరి (50), కుమార్ (46), షకీలా (44), కార్తీక్ (40)లకు వివాహమై విడివిడిగా జీవిస్తుండగా కరుణాకరన్, పద్మావతి దంపతులు కూడా వేర్వేరుగా జీవిస్తున్నారు. వృద్ధాప్యం, ఒంటరిగా ఉంటున్న కారణంగా గత కొన్ని నెలలుగా పద్మావతి మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, పిల్లలను ఇంట్లో ఉంచినా.. వారితో గొడవ పడుతూ ఇంటికి వచ్చేదని చెబుతున్నారు.
అదేవిధంగా భార్యాభర్తల మధ్య తరచూ చిన్నపాటి గొడవలు జరుగుతుండేవని, ఈ కారణంగా వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు కాదు. కరుణాకరన్, పద్మావతి మధ్య తరచూ వాగ్వాదం జరుగుతూ ఉండేది. ఈ నెల 7వ తేదీన కరుణాకరన్ ఇంటికి బిర్యానీ పార్సిల్ తెచ్చుకున్నాడు. అయితే తన భార్యకు పెట్టకుండా ఒక్కడే.. ఆ బిర్యానీ తిన్నాడు. తనకు కూడా బిర్యానీ కావాలని భార్య అడిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో భర్త, భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వెంటనే భార్య పరిగెత్తుకుంటూ వచ్చి భర్తను హత్తుకుంది. దీంతో ఇద్దరూ మంటల్లో సజీవ దహనం అయ్యారు.