భర్త ఇంట్లో భోజనం చేయట్లేదని.. భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌ లో మరో విషాదకరమైన సంఘటన వెలుగు చూసింది. భర్త ఇంట్లో అన్నం తినకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య బలవన్మరణానికి పాల్పడింది.

By అంజి  Published on  10 July 2023 10:42 AM IST
Wife commits suicide, Banjara Hills, Crime news

భర్త ఇంట్లో భోజనం చేయట్లేదని.. భార్య ఆత్మహత్య

దంపతుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం.. చాలా మంది వివాదం ఏదైనా కాసేపటి తర్వాత అన్యోన్యంగా కలిసిపోతారు. కానీ, కొందరు మాత్రం చినికి చినికి గాలివాన అయ్యేలా చేసుకుంటారు. పైగా ఆ క్షణికావేశంలో లేనిపోని నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆ కుటుంబంలో తీరని లోటు మిగిలిపోతోంది. తాజాగా హైదరాబాద్‌ నగరంలో మరో విషాదకరమైన సంఘటన వెలుగు చూసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దంపతుల మధ్య కీచరాట మొదలైంది. తీవ్ర మనస్థాపానికి గురైన భార్య బలవన్మరణానికి పాల్పడింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంజీవ్, సంగీత (23) దంపతులు. వీరికి 2019లో వివాహమైంది. బంజారాహిల్స్ లోని గౌరీ శంకర్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరి మధ్య చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి భర్త ఇంట్లో భోజనం చేయడం లేదు. దీంతో ఇంట్లో అన్నం తినకపోవడంపై సంగీత తన భర్తను ప్రశ్నించింది. ప్రతి రోజూ వంట చేస్తున్నానని, తినకపోవడంతో అవి పాడైపోతున్నాయని వెల్లడించింది. అయితే భర్త సంజీవ్ భార్యతో మాట్లాడకుండా మౌనంగా ఉండడమే కాకుండా గత నాలుగు రోజులుగా ఇంట్లో భోజనం చేయకపోవడంతో సంగీత తీవ్ర మనస్థాపానికి గురైంది.

దీనికి తోడు ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలోనే సంగీత.. భర్త డ్యూటీకి వెళ్ళిన అనంతరం గదిలో వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సంగీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి సంజయ్‌ రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.

Next Story