భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చేయి నరికిన భర్త
West Bengal Man Chops Off Wife's Hand to Stop Her From Taking Govt Job.తనకు రాకున్నా సరే భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
By తోట వంశీ కుమార్ Published on 8 Jun 2022 9:08 AM ISTతనకు రాకున్నా సరే భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఏ భర్త అయినా సంతోషిస్తాడు. తమ కష్టాలు తీరిపోయినట్లే అని బావిస్తాడు. అయితే.. ఓ భర్త మాత్రం భార్య చేయిని నరికివేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు బుర్ద్వాన్‌లోని కోజల్సా గ్రామంలో షేర్ మహమ్మద్(26), రేణు ఖాతున్(23) దంపతులు నివసిస్తున్నారు. 2017లో వీరికి వివాహం జరిగింది. రేణు ఖాతున్ దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో నర్సింగ్ శిక్షణ తీసుకుంది. భర్త షేర్ మహమ్మద్ ఓ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. కాగా.. ఇటీవలే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో రేణు ఖాతున్ ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించింది.
భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తనను విడిచి వెళ్లిపోతుండని షేర్ మహమ్మద్ బావించాడు. ఆమె ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. తను ఉద్యోగం చేస్తానని రేణు ఖాతున్ స్పష్టం చేసింది. ఆగ్రహంతో ఊగిపోయిన షేర్ మహమ్మద్.. ఈ క్రమంలో రేణు ఖాతున్ నిద్రలో ఉండగా ఆమె కుడి చేయిని నరికివేశాడు.
రక్తపు మడుగులో ఉన్న రేణుని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె కుడి చేతిని తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. రేణు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రేణు భర్త, అతడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.