Warangal: పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాదం జరిగింది. నారక్కపేటకు చెందిన మామిడి రాకేష్ పెయింటర్‌గా పని చేస్తున్నాడు.
By అంజి Published on 3 Aug 2023 8:00 AM ISTWarangal: పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైంది నిరుద్యోగం కాగా.. ఆ తర్వాతది పెళ్లి. ఒక పక్క ఉద్యోగాలు లేక మరో పక్క పెళ్లి చేసుకునే విషయంలో కాలం గడిచిపోతూ ఉండటంతో పాటు చుట్టుపక్కల ఉండేవాళ్లు, బంధువులు పెట్టే ఒత్తిడితో యువతరం నలిగిపోతోంది. పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుత రోజుల్లో పెళ్లి అనే కాన్సెప్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లి అనే అంశం ఏకంగా ఓ యువకుడిని ప్రాణం తీసుకునేలా చేసింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాదం జరిగింది. నారక్కపేటకు చెందిన మామిడి రాకేష్ డిగ్రీ చదివి ప్రస్తుతం పెయింటర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సంబంధాలు రావడం లేదనే మనస్తాపంతో ఈ నెల 1వ తేదీన పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాకేష్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన జవడి శ్రీకాంత్ అనే 26 ఏళ్ల యువకుడు తనకు పెళ్లి కావట్లేదన్న మనస్తాపంతో ఉరేసుకుని చనిపోయాడు. శ్రీకాంత్‌కు రెండేళ్ల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది. అయితే అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చాలా సంబంధాలు చూసినా.. ఏదీ ఒకే కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి తండ్రి బాల్‌రెడ్డి గుండెలు బాదుకున్నాడు. మృతుడి తల్లి గతంలోనే చనిపోయిందని, తండ్రి బాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు.