Vizag: కోళ్లు దొంగిలించాడని.. దళిత యువకుడిపై పోలీసుల దాష్టీకం
కోళ్లు దొంగిలించాడనే ఆరోపణలతో దళితుడిని చిత్రహింసలకు గురిచేసినందుకు ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.
By అంజి Published on 3 Oct 2023 4:44 AM GMTVizag: కోళ్లు దొంగిలించాడని.. దళిత యువకుడిపై పోలీసుల దాష్టీకం
విశాఖపట్నం: కోళ్లు దొంగిలించాడనే ఆరోపణలతో దళితుడిని చిత్రహింసలకు గురిచేసినందుకు పద్మనాభం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. బాధితుడు వైజాగ్ జిల్లా పద్మనాభం మండల పరిధిలోని బందెవరపు గ్రామానికి చెందిన బందెవరపు పాపు(24)గా గుర్తించారు. అతడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆర్ మల్లేశ్వరరావు, ఇద్దరు కానిస్టేబుళ్లు కె శ్రీనివాసరావు, కె సతీష్‌లను విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ ఎ రవిశంకర్ సస్పెండ్ చేశారు.
ఈ ఘటనపై విచారణ జరిపించాలని దిశ పోలీస్‌స్టేషన్ ఏసీపీ సీహెచ్ వివేకానందను ఆదేశించారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. పాపు, అతని స్నేహితుడు యెర్నిబాబు కలిసి సెప్టెంబర్ చివరి వారంలో కోళ్లను దొంగిలించారు. వీరిద్దరిపై బందేవపురం గ్రామానికి చెందిన ఇందుకూరి రాజబాబు ఫిర్యాదు చేశాడు. అనంతరం పెద్దల సమక్షంలో పరిష్కరించారు. ఆ మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని పాపూ అంగీకరించాడు. అయితే రాజబాబు మనసు మార్చుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.సతీష్ వారిని విచారించారు. తప్పు ఒప్పుకొన్నామని, రాజాబాబుతో రాజీ అయ్యామని పాపు, ఎర్నిబాబు పోలీసులకు చెప్పారు. వారిని విడిపించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు రూ.5వేలు డిమాండ్ చేశారు. కానీ వారు నిరాకరించడంతో కానిస్టేబుళ్లు కస్టడీలో చిత్రహింసలు పెట్టారు. పాపూ గట్టిగా కేకలు వేయడంతో, స్టేషన్ బయటఉన్న కుటుంబ సభ్యులు లోపలికి పరుగెత్తుకొచ్చారు. వారిని చూసి కానిస్టేబుళ్లు శ్రీను, సతీష్ గోడదూకి పారిపోయారు.
కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
పాప, యెర్నిబాబులపై దొంగతనం కేసు నమోదు కాలేదని ప్రాథమిక విచారణలో తేలింది. 2023 జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితుడి కుడి కాలు ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. కానిస్టేబుల్ అదే కాలుపై తన్నాడు, ఇప్పుడు మరో శస్త్రచికిత్స అవసరం.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశారు.