అత్యాచారం ఆరోపణలతో విశాఖ‌ పూర్ణానంద స్వామి అరెస్ట్

తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలిక ఆశ్రయం కోసం అనాథ ఆశ్రమంలో చేరింది. అయితే ఆ ఆశ్రమంలో ఉన్న స్వామిజీ ఆ బాలికపై అత్యాచారానికి

By అంజి  Published on  20 Jun 2023 1:14 PM IST
Visakha, Purnananda Swamy,  minor girl, Crime news

అత్యాచారం ఆరోపణలతో విశాఖ‌ పూర్ణానంద స్వామి అరెస్ట్

తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలిక ఆశ్రయం కోసం అనాథ ఆశ్రమంలో చేరింది. అయితే ఆ ఆశ్రమంలో ఉన్న స్వామిజీ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు సంవత్సరాల పాటు బాలికను గొలుసులతో బంధించి చిత్ర హింసలకు గురి చేశాడు. అతడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలికకు ఓ మహిళ ఆశ్రయం ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో ఓ ఆశ్రమంలో చేరిన తనపై స్వామీజీ రెండు సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అనాథ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు స్వామీజీని సోమవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన బాధిత బాలిక చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత బాలికను బంధువులు 5వ తరగతి వరకు చదివించి, రెండేళ్ల కిందట విశాఖలోని కొత్త వెంకోజీపాలెం దగ్గర ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో సేవల నిమిత్తం పంపించారు.

ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీ బాలికతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయించడం ఇలా అనేక పనులు చేయించేవాడు. రాత్రయ్యాక గదిలోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేసేవాడని బాలిక తెలిపింది. సంవత్సరం నుంచి బాలికను ఓ గదిలో కాళ్లకు గొలుసు వేసి బంధించి, ఎదురు తిరిగితే కొట్టేవాడని వాపోయింది. నీటితో కలిపిన అన్నాన్ని పెట్టేవాడని, 14 రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేయాల్సి వచ్చేదని, బాత్రూం వెళ్లేందుకు కూడా అనుమతించేవాడు కాదని, ఇలా రెండు సంవత్సరాలు చిత్రహింసలకు గురి చేశాడని బాలిక ఆరోపించింది. అదే ఆశ్రమంలో పని చేస్తున్న పనినిషి.. బాలిక కష్టాలను చూసింది. ఈ నెల 13వ తేదీన పని మనిషి సాయంతో బాధితురాలు ఆశ్రమం నుంచి బయటపడింది. అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌లో బాలిక తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది.

రైలులో తనకు పరిచయం అయిన ప్రయాణికురాలితో బాలిక తన బాధను చెప్పుకుంది. బాధితురాలి పరిస్థితికి చలించిపోయిన మహిళ రెండు రోజుల కిందట కృష్ణా జిల్లా కంకిపాడులోని హాస్టల్‌ చేర్చే ప్రయత్నం చేయగా, వారు ఒప్పుకోలేదు. లోకల్‌ పీఎస్‌ నుండి లెటర్‌ తీసుకోస్తానే పర్మిషన్‌ ఇస్తామని చెప్పడంతో వారు కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఇచ్చిన లెటర్‌ను తీసుకుని బాలల సంక్షేమ కమిటీకి బాలికను తీసుకెళ్లడంతో విశాఖ ఆశ్రమంలో తాను అనుభవించిన నరకాన్ని వారికి బాలిక వివరించింది. అక్కడ ఛైల్డ్‌ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలికను విజయవాడలోని దిశ పోలీసుస్టేషన్‌కు పంపించారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా విశాఖ పోలీసులు స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు.

Next Story