వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రూప్ సింగ్ తండాలో ఆరు రోజుల క్రితం జరిగిన ఘోర పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్తి గొడవలతో కన్నతండ్రి, పిన్నతల్లి కుటుంబంపై పెట్రోల్, డీజిల్ పోసి నిప్పంటించిన ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కుమారుడు వెంకటేష్ మరణించగా, సాయంత్రం సర్పంచ్ రమణిబాయ్ కూడా ప్రాణాలు విడిచారు.
ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కక్షతో పెద్ద భార్య కుమారుడు అనార్ సింగ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి, మరో కుమారుడు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు అనార్ సింగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆస్తి కోసం కన్నవారిపైనే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.