గుజ‌రాత్‌లో చెడ్డీగ్యాంగ్ అరెస్ట్‌.. పెళ్లిలో కలుసుకుని చోరీలకు ప్లాన్

Vijayawada Police arrested 3 Chaddi Gang Members.గుంటూరు, కృష్ణా జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో చోరీల‌కు పాల్ప‌డి.. జ‌నాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Dec 2021 2:59 AM GMT
గుజ‌రాత్‌లో చెడ్డీగ్యాంగ్ అరెస్ట్‌.. పెళ్లిలో కలుసుకుని చోరీలకు ప్లాన్

గుంటూరు, కృష్ణా జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో చోరీల‌కు పాల్ప‌డి.. జ‌నాల్లో భ‌యాందోళ‌న‌లు క‌లుగ‌జేసిన చెడ్డీగ్యాంగ్ స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ అంత‌ర్ రాష్ట్ర దొంగ‌ల ముఠాలోని ముగ్గురు స‌భ్యుల‌ను గుజ‌రాత్‌లో ప‌ట్టుకుని విజ‌య‌వాడ న‌గ‌రానికి తీసుకువ‌చ్చారు. వీరిని విచారిస్తున్నారు. వీరి వ‌ద్ద నుంచి రూ.20వేల న‌గ‌దు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండీ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన స‌భ్యుల కోసం గాలింపు చేప‌ట్టారు.

విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్ వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 10మంది దొంగలు గత నెల 22న ఓ పెళ్లి విందులో కలుసుకున్నారు. అందరూ కలిసి దక్షిణాదిలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే రైలులో చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి 28న రైలులో విజయవాడ వ‌చ్చారు. ఐదుగురు చొప్పున రెండు ముఠాలుగా విడిపోయి శివారు ప్రాంతాల్లోని ఇళ్ల‌ను టార్గెట్ చేసేవారు. ప‌గ‌లు రెక్కీ నిర్వ‌హించి రాత్రి స‌మ‌యంలో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డేవారు. చోరీ చేసే స‌మ‌యంలో బ‌నీన్‌, నిక్క‌ర్ ధ‌రించే వారు. ఎవ‌రైనా ఎదురుతిరిగితే.. దాడి చేసేందుకు, త‌లుపులు ప‌గ‌ల‌కొట్టేందుకు పెద్ద‌క‌ర్ర‌లు, రాడ్లు తీసుకువెళ్లేవారు.

ఇలా ప‌లు ప్రాంతాల్లో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డి గ‌త నెల 29న తిరిగి గుజ‌రాత్ వెళ్లిపోయారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆధారంగా గుజ‌రాత్‌కు చెందిన చెడ్డీగ్యాంగ్‌ ప‌నిగా నిర్థార‌ణ‌కు వ‌చ్చిన పోలీసులు వెంట‌నే దాహోద్ జిల్లా ఎస్పీతో మాట్లాడి.. విజ‌య‌వాడ నుంచి రెండు బృందాలు అక్క‌డికి చేరుకున్నాయి. ప‌ది మంది బృందంలో.. ముగ్గురిని ప‌ట్టుకోగా మిగిలిన ఏడుగురు ప‌రారు అయ్యారు. మిగిలిన వారి కోసం గాలింపు చేప‌ట్టారు. చెడ్డీగ్యాంగ్‌ సభ్యులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తూర్పు మండలం డీసీపీ హర్షవర్ధన్ రాజు, సీసీఎస్ ఇన్‌చార్జ్ కొల్లి శ్రీనివాస్, పశ్చిమ ఏసీపీ హనుమంతరావును విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్ అభినందించారు.

Next Story