ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య
Vastu expert Chandrashekhar Guruji stabbed to death in hotel.ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యకు
By తోట వంశీ కుమార్ Published on 6 July 2022 8:41 AM IST
ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్యకు గురైయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లిలోని ఓ హోటల్‌లోని రిసెప్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆయన్ను కత్తులతో పొడిచి చంపారు. వాస్తు సూచనల కోసం వచ్చామని ఆగంతుకులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం ఆ హోటల్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నాలుగు గంటల్లోనే నిందితులను బెళగావి జిల్లా రామదుర్గ వద్ద పట్టుకున్నారు. కాగా.. చంద్రశేఖర్ గురూజీ శరీరంపై మొత్తం 39 కత్తిపోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అంత్యక్రియలు నేడు(బుధవారం) సుళ్య గ్రామంలో జరగనున్నాయి. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు.
బాగల్‌కోట్‌కు చెందిన చంద్రశేఖర్ గురూజీ కాంట్రాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి ముంబైలో స్థిరపడ్డారు. తర్వాత వాస్తు వృత్తిని చేపట్టారు. సరళ వాస్తు చెబుతూ మంచిపేరు తెచ్చుకున్నారు. అనేక టీవీ ఛానళ్లలో ఆయన వాస్తుకు సంబంధించిన సలహాలు, సూచనలిచ్చేవారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 16కు పైగా అవార్డులను అందుకున్నారు. యూట్యూబ్‌లో ఆయన వీడియోలకు లక్షలాది వ్యూస్ రావడం బట్టి ఆయన ప్రజాదరణ ఏమిటో అర్థమవుతుంది.