నీట్ అభ్యర్థినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో గుడిలో పెళ్లి.. బిడ్డ పుట్టాక పరారీ
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక నీట్ అభ్యర్థినిపై జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో నమ్మించి, గర్భవతిని చేసి..
By - అంజి |
నీట్ అభ్యర్థినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో గుడిలో పెళ్లి.. బిడ్డ పుట్టాక పరారీ
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక నీట్ అభ్యర్థినిపై జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో నమ్మించి, గర్భవతిని చేసి, బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లీబిడ్డలను నడిరోడ్డుపై వదిలేసిన ఒక యువకుడి ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. బాధిత యువతి (ప్రియా - పేరు మార్చబడింది) 2023లో నీట్ పరీక్షల కోచింగ్ కోసం లక్నోకు వచ్చింది. గోమ్తీ నగర్ ప్రాంతంలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో, ఆమెకు ఆదిత్య యాదవ్ అనే క్యాబ్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. క్యాబ్ ప్రయాణాల్లో మొదలైన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరోజు ఆదిత్య ఆ యువతిని హోటల్ గదికి తీసుకెళ్లి, టీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆదిత్య మాట మార్చకుండా, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన స్నేహితుల సమక్షంలో చంద్రికా దేవి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, తన కుటుంబ సభ్యులకు మాత్రం ఆమెను ఎప్పుడూ పరిచయం చేయలేదు. వీరికి ఆడబిడ్డ జన్మించిన తర్వాత, ఆదిత్య ఒక అద్దె ఇల్లు తీసుకుని మూడు రోజుల పాటు ఆమెతో కలిసి ఉన్నాడు.
కానీ, మూడవ రోజు మందులు తీసుకువస్తానని చెప్పి బయటకు వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితురాలు తన స్నేహితుల ద్వారా అతడిని సంప్రదించడానికి ప్రయత్నించగా.. "నువ్వు, నీ బిడ్డ చచ్చిపోండి" అంటూ అత్యంత క్రూరంగా సమాధానం ఇచ్చాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.