డబ్బులు ఇవ్వలేదని రూమ్‌లో బంధించి విద్యార్థిపై సీనియర్ల దాడి.. బట్టలు ఊడదీసి..
ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 8 May 2024 8:34 AM ISTడబ్బులు ఇవ్వలేదని రూమ్‌లో బంధించి విద్యార్థిపై సీనియర్ల దాడి.. బట్టలు ఊడదీసి..
ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న మైనర్ విద్యార్థి తమ వద్ద డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదని సీనియర్ విద్యార్థుల గ్యాంగ్ అతన్ని చిత్ర హింసలకు గురి చేసింది. దారుణం కొడుతూ వీడియోలు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత విద్యార్థి పోటీ పరీక్షల కోసం కోచింగ్ క్లాసులో చేరాడు. ఇతను ఇటావా నుంచి కాన్పూర్‌కు వచ్చి ఉంటున్నాడు. కోచింగ్ సెంటర్‌లో కొందరు సీనియర్ విద్యార్థులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారి వద్ద నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. దానిని ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం ఉపయోగించాడు. అలా విడతల వారీగా మొత్తం రూ.20వేలు అప్పుగా తీసుకున్నాడు విద్యార్థి. అయితే.. ఆన్‌లైన్ గేమింగ్‌లో అతను డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాము ఇచ్చిన రూ.20వేలకు.. 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థిపై ఒత్తిడి తెచ్చారు. పెద్దమొత్తంలో డబ్బు బాధిత విద్యార్థి తిరిగి ఇవ్వలేకపోయాడు. దాంతో.. కోపంతో ఊగిపోయిన సీనియర్ విద్యార్థులు.. అతన్ని తమ గదిలోకి తీసుకెళ్లారు. చిత్రహింసలు పెట్టారు. పదేపదే కొట్టారు. అంతేకాదు.. నిప్పుతో విద్యార్థి ముఖాన్ని కూడా కాల్చేందుకు ప్రయత్నించారు. చిత్రహింసలు పెడుతున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అవి కాస్త వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్లు సదురు సీనియర్ విద్యార్థులు చేస్తున్న పనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 4వ తేదీన ఈ వీడియోలు బయటకు వచ్చాయి. అంతకుముందు నుంచే విద్యార్థిని సీనియర్లు ఇబ్బందులు పెడుతున్నారు.
#UttarPradesh: Students preparing for #NEET in #Kanpur brutally beat up their classmate. He was hung by tying a rope around his private part. They tried to burn his hair with fire spray.Actually, the victim student lost 20K in an online game. pic.twitter.com/TO1MhtAt0y
— Siraj Noorani (@sirajnoorani) May 7, 2024
ఇక బాధిత విద్యార్థి తనని సీనియర్లు పెడుతున్న టార్చర్ గురించి తల్లిదండ్రులకు ముందుగా చెప్పాడు. వారు ఇటావాలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చిన్నవిషయమే అనుకుని వార్నింగ్ ఇచ్చారు. దాంతో.. అతన్ని విడిచిపెట్టినట్లు కూడా తెలిపారు. కానీ.. ఇటీవల మరోసారి టార్చర్ పెడుతున్న వీడియోలు బయటకు రావడంతో కాన్పూర్ పోలీసులు రంగంలోకి దిగారు. సదురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. నిందితులపై IPC సెక్షన్లు 147, 34, 343, 323, 500, 506, మరియు 307 కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ గౌతమ్ తెలిపారు. వారిపై పోక్సో చట్టం మరియు సెక్షన్ 67 (బి) నిబంధనల ప్రకారం కూడా అభియోగాలు మోపారు. నిందితులను తనయ్ చౌరాసియా, అభిషేక్ కుమార్ వర్మ, యోగేష్ విశ్వకర్మ, సంజీవ్ కుమార్ యాదవ్, హరగోవింద్ తివారీ, శివ త్రిపాఠిలుగా గుర్తించారు.
మరోవైపు ఈ నిందితులు ముఠాగా ఏర్పడి అమాయక స్టూడెంట్లను ట్రాప్ చేసి బెదిరించి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామని ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారనే దానినపై ఆరా తీస్తున్నామని చెప్పారు.