ప్రేమ వ్యవహారం తెలిసి.. కూతురిని ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాకే.!

Uttar Pradesh man hired killer to murder 17year old daughter. ఇంట్లో వేధింపులు తట్టుకోలేక.. ఓ 17 ఏళ్ల యువతి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది.

By అంజి  Published on  7 Aug 2022 5:11 PM IST
ప్రేమ వ్యవహారం తెలిసి.. కూతురిని ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాకే.!

ఇంట్లో వేధింపులు తట్టుకోలేక.. ఓ 17 ఏళ్ల యువతి టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలోనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే కూతురు చికిత్స పొందుతుండగానే తండ్రి దారుణానికి యత్నించాడు. తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమిస్తోందని కూతురిని చంపేందుకు ప్లాన్‌ చేశాడు. ఇందుకోసం ఆస్పత్రి సిబ్బందికి డబ్బులు ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

కంకేర్ ఖేరాకు చెందిన నవీన్ కుమార్ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి. ఆయన కుమార్తె ఒక వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో.. ఆ వ్యక్తిని మరచిపోవాలని కుటుంబసభ్యులు ఆమెకు పలు మార్లు చెప్పారు. ఆమె మాత్రం వారి మాటలు లెక్క చేయలేదు. కూతురిపై తండ్రి నవీన్​కు కోపం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తండ్రి, కూతురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన కుమార్తె టెర్రస్‌పై పైనుంచి కిందకు దూకింది.

ఆ బాలికను కుటుంబసభ్యులు కంకేర్‌ఖేరాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మోడీపురంలోని ఫ్యూచర్​ ప్లస్​ ఆసుపత్రికి తరలించారు. ఇదే అదనుగా భావించి తన మాట వినకుండా ప్రవర్తిస్తున్న కూతురిని చంపేందుకు తండ్రి నవీన్‌ కుమార్‌ ప్లాన్‌ వేశాడు. అక్కడే ఉన్న ఓ వార్డ్​ బాయ్‌ నరేష్‌కి రూ. 1లక్ష ఇచ్చి.. తన కూతురిని చంపేయాలని చెప్పాడు. డబ్బుకు ఆశపడ్డ.. ఆ వార్డ్​ బాయ్​ ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. అర్ధరాత్రి ఎవరూ లేని టైమ్‌లో డాక్టర్‌ వేషంలో యువతి చికిత్స పొందుతున్న రూమ్‌లోకి ప్రవేశించాడు. ఇందుకు అక్కడే ఉన్న ఓ మహిళా ఉద్యోగిని సాయం చేసింది. యువతికి పొటాషియం క్లోరైడ్‌ ఇంజెక్షన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ యువతి పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారింది.

డాక్టర్లు వచ్చి చూసేసరికి.. ఆ మైనర్​ తీవ్రంగా బాధపడుతోంది. మొదటగా వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత పొటాషియం క్లోరైడ్​ ఇచ్చినట్టు వైద్యులు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని గంటల్లోనే కేసును పరిష్కరించారు. సీసీటీవీ ఫుటేజీలో నరేష్​ లోపలికి వెళ్లడం, ఇంజెక్షన్​ ఇవ్వడం స్పష్టంగా కనిపించింది.

ఈ క్రమంలోనే నరేషన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి తండ్రి నవీన్​ చెప్పడంతోనే ఈ పని చేసినట్టు నరేష్​ పోలీసులకు చెప్పేశాడు. నవీన్​తో పాటు.. నరేష్​కు సాయం చేసిన మహిళా ఉద్యోగిని పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా.. నవీన్​ నిజం ఒప్పుకున్నాడు. తనకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమిస్తున్నందుకే.. తన బిడ్డను చంపాలని చూసినట్టు అంగీకరించాడు. అలాగే వారి నుంచి విరిగిన సిరంజీతోపాటు అతడి వద్ద ఉన్న రూ.90,000ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story