ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. తండ్రే తన కుమార్తెను కడతేర్చాడు. అంతేకాదు తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన అతడు ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో తిరిగాడు. అంతే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ వెన్నులో వణుకుపుట్టింది. లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి, నరికేసిన ఓ తలను చేత్తో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. ఆ తల ఆయన కుమార్తెదేనని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడి చేరుకున్న ఇద్దరు పోలీస్ అధికారులు సర్వేశ్ ను ప్రశ్నించారు. తొలుత అతని పేరు అడిగి, ఆ తల ఎవరిదని ప్రశ్నించగా, ఏ మాత్రం సంకోచం లేకుండా, అది తన కుమార్తెదని, హత్య చేసింది తాను ఒక్కడినేనని చెప్పాడు. అందుకు కారణం ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అందుకే భరించలేక హత్య చేశానని అన్నాడు. ఆపై పోలీసులు నరికిన తల కిందపెట్టి, కూర్చోవాలని సూచించగా చెప్పినట్టుగానే చేశాడు. మిగతా శరీరభాగం ఇంట్లోనే ఉందని చెప్పాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కేసును నమోదు చేశారు. పోలీసులతో అతడు మాట్లాడడాన్ని వీడియోగా రికార్డు కూడా చేశారు.