3 ఏళ్ల బాలుడు తుపాకీతో ఆడుకుంటూ తల్లిని చంపాడు
US toddler kills mother while playing with gun.పెద్దవారు ఏ పనిలో ఉన్నా సరే చిన్న పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాలను
By తోట వంశీ కుమార్ Published on 15 March 2022 10:14 AM ISTపెద్దవారు ఏ పనిలో ఉన్నా సరే చిన్న పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాలను ఓ కంట గమినించాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఒక్కొసారి విషాదాలను మిగుల్చుతుంటాయి అనడానికి ఈ ఘటననే నిదర్శనం. మూడేళ్ల చిన్నారిని తీసుకుని తల్లిదండ్రులు ఓ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ కారు వెనుక సీటులో కూర్చున్న చిన్నారి తుపాకీతో ఆడుకుంటుండగా అది ప్రమాదవశాత్తు పేలడంతో.. ఆ చిన్నారి తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
స్థానిక పోలీసు చీఫ్ రాబర్ట్ కాలిన్స్ తెలిపిన వివరాల మేరకు.. మిడ్‌వెస్ట్రన్ నగరంలోని శివారు ప్రాంతమైన డాల్టన్‌లోని సూపర్ మార్కెట్‌కు శనివారం సాయంత్రం మూడేళ్ల చిన్నారితో కలిసి కారులో దంపతులు వెళ్లారు. పార్కింగ్ ఏరియాలో కారును పార్కు చేశారు. తల్లిదండ్రులు ముందు సీటులో కూర్చోగా.. చిన్నారి వెనుక చైల్డ్ సీటులో కూర్చుకున్నాడు. ఎలా తీసుకున్నాడో తెలీదు కానీ అతడి తండ్రి పిస్టల్ ను తీసుకుని దానితో ఆటలాడడం ప్రారంభించాడు.
ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. సడెన్ గా తుపాకీ పేలింది. బుల్లెట్ చిన్నారి తల్లి డేజా బెన్నెట్(22) మెడ వెనుక భాగం నుంచి దూసుకువెళ్లింది. వెంటనే చిన్నారి తండ్రి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడు చట్ట బద్దంగా తుపాకీ కలిగిఉన్నాడా..? లేదా అన్నదానిపై కూడా విచారణ చేపట్టారు.
మైనర్‌లు అనుకోకుండా కాల్పులు జరపడం వల్ల ప్రతి సంవత్సరం సగటున 350 మంది చనిపోతున్నారని ఆయుధాలు మరియు వాటి నిల్వపై మెరుగైన పర్యవేక్షణ కోసం ప్రచారం చేస్తున్న సంస్థ అంచనా వేసింది.