డబ్బు విషయంలో గొడవ.. భార్యను రుబ్బు రాయితో కొట్టి చంపిన భర్త

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో డబ్బు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిన తరువాత ఒక వ్యక్తి తన భార్య తలపై రుబ్బు రాయితో కొట్టి హత్య చేశాడని పోలీసులు మంగళవారం తెలిపారు.

By అంజి
Published on : 16 July 2025 10:11 AM IST

UP man kills sleeping wife, argument, money, 13-year-old son escapes

డబ్బు విషయంలో గొడవ.. భార్యను రుబ్బు రాయితో కొట్టి చంపిన భర్త

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో డబ్బు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిన తరువాత ఒక వ్యక్తి తన భార్య తలపై రుబ్బు రాయితో కొట్టి హత్య చేశాడని పోలీసులు మంగళవారం తెలిపారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన 13 ఏళ్ల కొడుకుపై నిందితుడు దాడికి యత్నించాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు, 36 ఏళ్ల ఆశా భారతి, కస్తూర్బా స్కూల్‌లో టీచర్‌గా పనిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ స్టోర్ నడుపుతున్న ఆమె భర్త రవి ప్రతాప్ ప్రతి నెలా రూ.15,000 ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు.

ఆశా అతనికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించి, బదులుగా రూ. 5,000 ఇవ్వజూపడంతో, ఉద్రిక్తతలు పెరిగాయని, ఫలితంగా దంపతుల మధ్య తరచుగా వాదనలు జరిగేవని తెలుస్తోంది. సంఘటన జరిగిన రోజు రాత్రి, నిందితుడు తన భార్య నిద్రపోతున్నప్పుడు రుబ్బు రాయితో దాడి చేసి, ఆమె తలపై తీవ్రంగా కొట్టాడని ఆరోపించారు. శబ్దం విని మేల్కొన్న వారి 13 ఏళ్ల కుమారుడు తన తండ్రిని ఆపడానికి ప్రయత్నించాడు, కానీ అతను బాలుడిని తరిమికొట్టాడు.

ఆ బాలుడు తన తండ్రి దాడి నుండి తప్పించుకోగలిగాడు. పొరుగువారికి సమాచారం అందించాడు, వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆశాను గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే, ఆమె అక్కడికి చేరుకునేలోపే మరణించిందని వైద్యులు ప్రకటించారు. గోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దాడి తర్వాత రవి ప్రతాప్ అక్కడి నుంచి పారిపోయాడని, ఇంకా పరారీలో ఉన్నాడని స్టేషన్ ఇన్‌చార్జ్ అంజుల్ చతుర్వేది ధృవీకరించారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story