Hyderabad: బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేక..
పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 10 Jan 2025 10:14 AM ISTHyderabad: బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేక..
హైదరాబాద్: పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జె.ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంకు చెందిన కోట సత్య లావణ్య (32)గా గుర్తించారు. సత్య లావణ్యకు ఐటీ ప్రొఫెషనల్ బత్తుల వీరమోహన్‌తో వివాహమై ఐదేళ్లయింది. బాచుపల్లి ఎంఎన్ రెసిడెన్సీలోని కేసీఆర్ కాలనీలో దంపతులు నివాసం ఉంటున్నారు.
సత్య లావణ్య బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ నగర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసింది. బ్యాంకులో తాను ఎదుర్కొంటున్న విపరీతమైన పని ఒత్తిడి గురించి ఆమె తన బంధువులకు చెప్పినట్టు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ జంట శుక్రవారం సంక్రాంతి పండుగ కోసం తమ స్వగ్రామానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం తొందరంగా పని పూర్తి చేసుకుని, పై ఆఫీసర్లకు చెప్పి సత్య లావణ్య ఇంటికి తిరిగి వచ్చింది.
కొద్దిసేపటికే ఆమె తన అపార్ట్‌మెంట్ భవనంలోని టెర్రస్‌పైకి వెళ్లి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ ఘటనను గమనించిన ఇరుగుపొరుగు వారు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారు ప్రయత్నించినప్పటికీ, ఆమె తీవ్ర గాయాలతో మరణించింది. ఆమె మృతికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగుల నుంచి వాంగ్మూలాలు సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.