Vizag: మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. సాయితేజ్ (22) అనే డిగ్రీ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By - అంజి |
మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. సాయితేజ్ (22) అనే డిగ్రీ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్‌గా రాయించడం, మరో మహిళా లెక్చరర్‌తో కలిసి లైంగికంగా వేధించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎంవీపీ కాలనీలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ కోన సూరిబాబు పెద్ద కుమారుడు సాయితేజ (22) సమతా డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో మహిళా లెక్చరర్ తనను నిత్యం వేధిస్తున్నారని, పరీక్షల్లో జవాబులు బాగా రాసినా మార్కులు వేయడం లేదని, రికార్డులు అధికంగా రాయిస్తున్నారని విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పాడు.
ఈ వేధింపులపై కాలేజీ యాజమాన్యంతో మాట్లాడేందుకు సాయితేజ తల్లిదండ్రులు శుక్రవారం నాడు కాలేజీకి వెళ్లారు. అక్కడ ఉండగానే వారు ఇంట్లో ఉన్న సాయితేజతో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతిచెంది ఉన్నాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక అవసరాల కోసం సాయితేజపై మహిళా లెక్చరర్లు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.