ఖమ్మం జిల్లాలో విషాదం.. కొడుకు మృతిని తట్టుకోలేక ఖననం చేసిన చోటే తండ్రి ఆత్మహత్య
Unable to bear the death of his son man committed suicide.ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి మృతిని
By తోట వంశీ కుమార్ Published on 19 Dec 2021 6:56 AM GMT
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సత్తుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి పట్టణంలో రాంబాబు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అతడి కుమారుడు సాయి భాను ప్రకాశ్ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న స్నేహితులతో కలిసి పాఠశాలలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ విషయమై పాఠశాల యాజమాన్యం సాయిని మందలించింది. వారం రోజుల పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో సాయి తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ నెల 15న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.
గమనించిన కుటుంబ సభ్యులు సాయిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 16న సాయి మృతి చెందాడు. అతడి అంత్యక్రియలను సత్తుపల్లిలో నిర్వహించారు. అయితే.. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని రాంబాబు.. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం వెతుకుతుండగా.. ఆదివారం ఉదయం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతంలోని చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.